=

మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం
stroms  Srimad Bhagavad Gita  Valmiki Ramayanam

మహాశివరాత్రి - విశేషాలు


మహాశివరాత్రి :

                      మాఘమాసంలో అమావాస్యకు ముందురోజు శివరాత్రి వస్తుంది. అన్ని పండుగల్లోనూ చిట్టచివరిది మహాశివరాత్రి. ఆడంబరాలు, ఆర్భాటాలు లేని ఒకేఒక్క పండుగ శివరాత్రి. జన్మమొత్తంమీద ఒక్కసారి అభిషేకం చేసినా, శివపూజ చేసినా మోక్షాన్ని అనుగ్రహించేది మహాశివరాత్రి. పాతాళం నుంచి అంతరిక్షం వరకు పద్నాలుగు లోకాలున్నాయి. దీనికి ఆవలిదైన బ్రహ్మాండం అంతానిండి, ఆ పైన కూడా వ్యాపించి ఆవిర్భవిస్తున్న స్ఫటికలింగం దర్శనమిస్తోంది. దానిపై ఉన్న పున్నమి చంద్రునిలో నుంచి అమృతధారలు కురుస్తున్నాయి. ఆ మహాస్ఫటికలింగం అనంతం. అచలం. ఏకైకం. అదే శివరూపం. రుద్రానువాకాలైన నమక చమకాలను జపిస్తూ, ధ్యానిస్తూ అభిషేకించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే ఇది మహాశివరాత్రి. పరమేశ్వర స్వరూపం ఈ లింగమే. దీనికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏమీ ఉండవు. నిలువుగా గుడ్డు ఆకారంలో ఆవిర్భవించిన మహాస్ఫటిక లింగం విశ్వశక్తి అయిన నిరాకార పరబ్రహ్మం తాలూకు సాకార దర్శనం. ఇది నిర్లిప్తం. శుద్ధం. గుణదోష రహితం. నిరంజనం నిర్వికారం. నిర్గుణ పరబ్రహ్మకు చిహ్నమే మహాశివరాత్రి నాడు ఆవిర్భవించే మహాలింగ స్వరూపంగా వేదోపనిషత్తులు, పురాణాలు వర్ణించే విశిష్ట పర్వదినం మహాశివరాత్రి.

శివ'' అంటే "శివుడు - "రాత్రి'' అంటే "పార్వతీదేవి

శివరాత్రి .."శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.

అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికంతటికీ పర్వదినం అయింది.

అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.

ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.అభిషేకం ఎందుకు చేయాలి ?"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.

                     ఇందులో అంతరార్థం ఏమిటంటే -"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం.

                     అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో
                          "శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం.

                         అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.

ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.

ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే"జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.

నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో"శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి"శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది.

                      "వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో                       మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.

అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.

"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||

శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.

శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలోఅభిషేకం తప్పనిసరిగా చేయాలి.

తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి. నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు,
"ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత.💐

శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం.

మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.

సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,

వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని"బిల్వాష్టకం''లో చెప్పబడింది.

"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.

ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

జాగరణ ఎందుకు చేయాలి..

క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది.

"జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు. శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.

మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.

ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను "ఆదిభిక్షువు'' అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాసస్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.

ఈ "నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.

బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి'' మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.

అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే"శివరాత్రి'' మహత్యం.

రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే "రామేశ్వరం''.

శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు.

ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ "నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలులేనిది ఆయన మమకారం. "శివా''అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.

దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.

దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర... "నీకు నేనున్నారురా దిక్కు'' అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు "శివుడు'' ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే..

ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.

అందుకే "మహాశివరాత్రి''నాడైనా మహాదేవుని స్మరిద్దాం. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం
"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..

సేకరణ


www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.